పశుపతినాథ్ ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి..
- అడిషనల్ కలెక్టర్ రవికుమార్‌కు ఆలయ కమిటీ, గ్రామస్తుల వినతి
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానానికి చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నాలుగేళ్ల క్రితమే దేవస్థానానికి 1.25 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఇప్పటివరకు భూమికి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు పరిశీలనలు నిర్వహించినా భూమి పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
దీని ఫలితంగా ఆలయ భూమిలో ఇప్పటికే వెటర్నరీ ఆస్పత్రి, వాటర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్, అంగన్‌వాడీ కేంద్రంతో పాటు మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు ఏర్పాటైనట్లు విచారణలో తేలినా సంబంధిత శాఖలు స్పందించలేదని తెలిపారు. దీంతో మిగిలిన భూమి కూడా క్రమంగా ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని, అందులోని అక్షరాలు చెరిగిపోవడంతో ఆలయ భూమి వివరాలు ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సంబంధిత ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు.
హెచ్చరిక బోర్డును వెంటనే పునరుద్ధరించడంతో పాటు ఆలయ భూములకు శాశ్వత హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
