రిజర్వాయర్ నీటితో రైతుల పంటలను కాపాడతాం..

  • మండలగూడెంలో అభివృద్ధి పనుల ప్రారంభం
  • ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామంలో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, రూ.10 లక్షలతో నిర్మించనున్న మరో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల పథకం ద్వారా గోదావరి జలాలతో బొమ్మకూరు రిజర్వాయర్‌ను నింపి మండలగూడెం గ్రామానికి సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

గత రెండున్నరేళ్లలో గ్రామానికి 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేయించడంతో పాటు, రూ.20 లక్షలతో కాలువ మరమ్మతులు చేపట్టి చెరువును గోదావరి నీటితో నింపినట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో రూ.కోటి వ్యయంతో 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించామని, మరో 20 ఇందిరమ్మ ఇండ్లు, రూ.20 లక్షలతో సీసీ రోడ్లను మంజూరు చేస్తానని ప్రకటించారు. మహిళా కమ్యూనిటీ భవనానికి ఇప్పటికే రూ.10 లక్షలు మంజూరైనప్పటికీ సాంకేతిక కారణాలతో పనులు ప్రారంభం కాలేదని, కలెక్టర్‌తో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని తెలిపారు. రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే నాయకులను ప్రజలు ఆదరించాలని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కొనసాగాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, గ్రామ సర్పంచ్ డ్యాగల రాజశేఖర్, నాయకులు లింగాల జగదీశ్ చందర్ రెడ్డి, బోనాసి క్రాంతికుమార్, గాదె మహేందర్, నామాల బుచ్చయ్య, లోనే శ్రవణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, అధికారులు, గ్రామ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.