13న జాతీయ నూలిపురుగుల నిర్మూలన దినోత్సవం

  • పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి
  • తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. కాటం రాజు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జాతీయ నూలిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని (ఎన్‌డిడి) పురస్కరించుకుని 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటం రాజు పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమ నిర్వహణపై తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లతో ఆయన ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ​

ఈ సందర్భంగా డా. కాటం రాజు మాట్లాడుతూ.. సోమవారం ఈనెల13న జరగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్బెండజోల్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆ రోజు మాత్రలు వేసుకోలేకపోయిన విద్యార్థుల కోసం మళ్లీ జులై 20వ తేదీ ‘మొప్-అప్’ రౌండ్ నిర్వహించి, మిగిలిపోయిన పిల్లలందరికీ ఈ మాత్రలు అందిస్తామని స్పష్టం చేశారు. ​పిల్లల మెరుగైన ఆరోగ్యానికి, శారీరక ఎదుగుదలకు నూలిపురుగుల నిర్మూలన ఎంతో అవసరమని, ఈ బృహత్తర కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది బాధ్యతగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.