VivaTech-2026 | ఏఐ కంట్రీ పార్ట్‌నర్‌గా భార‌త్..

  • వివాటెక్-2026లో భారత్ హవా..
  • భారత్ స్టార్టప్‌ల సత్తా..
  • ప్రపంచ టెక్ వేదికపై భారత్ ప్రత్యేక ముద్ర
  • 80కి పైగా భారత డీప్‌టెక్ సంస్థలతో భారత్ ప్రదర్శన
  • ఇన్నోవేషన్ ఇయర్‌లో భారత్-ఫ్రాన్స్ టెక్నాలజీ భాగస్వామ్యానికి కొత్త ఊపు

ఆంధ్రప్రభ : యూరప్‌లోనే అతిపెద్ద సాంకేతిక, స్టార్టప్ వేదిక అయిన ‘వివాటెక్-2026’లో భారత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, వ్యాపార నాయకులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

కృత్రిమ మేధస్సు (ఏఐ), అత్యాధునిక సాంకేతికతలకు మానవ-కేంద్రీకృత విధానమే భారత్ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత వ్యవసాయ పురోగతి, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో భారత్ సాధించిన విప్లవాత్మక మార్పులను ఆయన వివరించారు. ప్రసంగం అనంతరం మోదీ, మాక్రాన్ కలిసి పరిశ్రమలు, ఆరోగ్యం, సుస్థిరాభివృద్ధి, రవాణా రంగాలకు సంబంధించిన వినూత్న పరిష్కారాలను ప్రదర్శించిన భారత స్టార్టప్‌లు, ఆవిష్కర్తలతో ముచ్చటించారు.

అయితే, వివాటెక్-2026లో భారత్‌కు ‘ఏఐ కంట్రీ పార్ట్‌నర్’ హోదా లభించడం విశేషం. ఈ ఏడాది వివాటెక్‌లో భారత్ ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థాయిలో పాల్గొంటోంది. కృత్రిమ మేధస్సు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్య సాంకేతికత, స్వచ్ఛ సాంకేతికతలు, మొబిలిటీ, ఆధునిక కంప్యూటింగ్ వంటి రంగాలను ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన మండపాలను ఏర్పాటు చేశారు. 80కి పైగా భారత డీప్‌టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు ఈ ప్రదర్శనలో తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నాయి.

భారత్-ఫ్రాన్స్ సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో వివాటెక్ కీలక వేదికగా మారనుంది. గత కొన్నేళ్లుగా భారత్‌కు వివాటెక్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో మోదీ వివాటెక్‌లో ముఖ్య ప్రసంగం చేయగా, 2022లో ‘కంట్రీ ఆఫ్ ది ఇయర్’గా భారత్ గుర్తింపు పొందింది. ఇటీవల బెంగళూరు టెక్ సమ్మిట్‌తో వివాటెక్ భాగస్వామ్యాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది.