మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

  • సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మెంట ఎల్లయ్య

మోత్కూర్, ఆంధ్రప్రభ: మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, రెండో పీఆర్సీలో కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మెంట ఎల్లయ్య డిమాండ్ చేశారు.గురువారం మోత్కూర్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.

మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, 2025 జనవరి నుంచి 2026 మే వరకు కార్మికుల వేతనాల నుంచి మినహాయించిన పీఎఫ్, ఈఎస్ఐ నిధులను వెంటనే జమ చేయాలని కోరారు.విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వర్షాకాలంలో సబ్బులు, నూనెలు, రెయిన్‌కోట్లు, వైద్య కిట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో కార్మికులకు ప్రాధాన్యం కల్పించాలని, ఈఎస్ఐ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని హెచ్చరించారు.