బీచ్ షాక్ పాలసీతో ఏపీలో పర్యాటక రంగానికి జోష్
బీచ్ షాక్ పాలసీతో ఏపీలో పర్యాటక రంగానికి జోష్
తీరప్రాంతాల్లో భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలకు మార్గం..
పర్యాటక సర్క్యూట్లు, స్టేక్‌హోల్డర్ కమిటీలు ఏర్పాటు చేయాలి
బీచ్ షాక్‌ల విస్తీర్ణం పెంపు, పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి
ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీచ్ షాక్ పాలసీతో ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి కొత్త జోష్ లభించనుందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) పేర్కొంది. తీరప్రాంతాల్లో ఉన్న అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని వినియోగించుకోవడంతో పాటు భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల సృష్టికి ఈ విధానం దోహదపడుతుందని అభిప్రాయపడింది. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పర్యాటక కమిటీ సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు వెలువడ్డాయి.
ఈ సందర్భంగా ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ పర్యాటక రంగ సమస్యల పరిష్కారం, విధానాల రూపకల్పన కోసం అన్ని వర్గాల ప్రతినిధులతో రాష్ట్రస్థాయి పర్యాటక స్టేక్‌హోల్డర్ కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విశాఖపట్నం, విజయవాడ, రాయలసీమ ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని, ప్రధాన పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం డెస్టినేషన్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పర్యాటక, ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేసి వేగవంతం చేయాలని కోరారు.
ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏపీ ఛాంబర్స్ టూరిజం కమిటీ చైర్మన్ ఆర్.వి. స్వామి మాట్లాడుతూ ప్రస్తుతం బీచ్ షాక్‌లకు అనుమతిస్తున్న 1,500 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 3,000 చదరపు అడుగులకు పెంచాలని సూచించారు. దీనివల్ల పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. రూ.1 కోటి నుంచి రూ.15 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన అనేక చిన్న, మధ్యతరహా పర్యాటక ప్రాజెక్టులు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని, వాటికి త్వరితగతిన ఆమోదాలు లభిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. హోమ్‌స్టే పాలసీ అమలును వేగవంతం చేసి, ఆమోదం పొందిన హోమ్‌స్టేల జాబితాను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీచ్ షాక్ పాలసీ అమలుతో రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త పెట్టుబడులు, పర్యాటకుల రాక పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా బాటలు పడతాయని సమావేశంలో అభిప్రాయపడినట్లు ఏపీ ఛాంబర్స్ వెల్లడించింది.
