క్రైస్తవులు, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి

క్రైస్తవులు, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి
ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట నియోజకవర్గంలోని క్రైస్తవులు, పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం పట్టణంలోని శాలెం ఎంబీ చర్చ్ ఆవరణలో నూతన పాస్టర్ల కమిటీ సభ్యులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అచ్చంపేట క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా కూడా తాను అండగా ఉంటానన్నారు.
అవసరమైతే 24 గంటలూ అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని సూచించారు. నియోజకవర్గంలో చర్చిల నిర్మాణం, పాస్టర్లకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ఇతర ప్రభుత్వ పథకాలలో అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని పాస్టర్లను కోరారు. ప్రభుత్వానికి క్రైస్తవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణను పాస్టర్ల కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించగా, అనంతరం నూతన కమిటీని ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, పాస్టర్ల సంఘం గౌరవ అధ్యక్షులు ఆశీర్వాదం, అధ్యక్షులు కే. అబ్రహం, ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, జాన్ సొలోమోన్, ప్రధాన కార్యదర్శి షాలెం రాజు, సహాయ కార్యదర్శులు ఆర్. వెంకటయ్య, సంధ్యారాణి, ఆర్థిక కార్యదర్శి రాజారత్నం, ఆడిటర్ సుజ్ఞాని, క్రిస్టఫర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
