భారీ వర్షాలకు ముంచెత్తిన లోతట్టు ప్రాంతాలు

భారీ వర్షాలకు ముంచెత్తిన లోతట్టు ప్రాంతాలు

  • సమస్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరా
  • చౌటపల్లి వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి మంత్రి సీతక్కకు విజ్ఞప్తి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని, అచ్చంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు వరద నీటితో ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం పర్యటించారు. అచ్చంపేట పట్టణంలోని 9వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరి రహదారులపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాలనీ మధ్యలో నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలోని బ్రిడ్జ్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ బ్రిడ్జ్‌పై నుంచి వరద నీరు పారుతుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సందర్భంగా హై లెవెల్ వంతెన నిర్మాణం అవసరమని భావించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. చౌటపల్లి వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.