ఆయిల్ ఫామ్ నర్సరీలో అవకతవకలు
ఆయిల్ ఫామ్ నర్సరీలో అవకతవకలు
– విచారణకు బీఆర్ఎస్ డిమాండ్
తొర్రూరు, ఆంధ్రప్రభ:
మండలంలోని హరిపిరాల, గోపాలగిరి శివారులో ఉన్న ఆయిల్ ఫామ్ నర్సరీల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయని మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులు నర్సరీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలు అందించాల్సిన నర్సరీల్లో నాసిరకం విత్తనాలు, వర్మి కంపోస్ట్, మట్టి, ఎరువులు వినియోగిస్తున్నట్లు తెలిపారు. దీంతో వేలాది మొక్కలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆయన విమర్శించారు. 24 మంది కూలీలు పనిచేయాల్సిన చోట కేవలం 11 మందితోనే పనులు జరగడం వల్ల మొక్కల సంరక్షణ సరిగా జరగడం లేదని చెప్పారు.
2026 జనవరిలో నాటిన 60 వేల విత్తనాల్లో కేవలం 30 వేల విత్తనాలే మొలకెత్తాయని ఆయన తెలిపారు. మల్లంపల్లి నుంచి తీసుకురావాల్సిన ఎర్రమట్టికి బదులుగా ఇతర ప్రాంతాల మట్టిని వినియోగిస్తూ అక్రమ బిల్లులు చేస్తున్నారని ఆరోపించారు.
నర్సరీల్లో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెంచర్ల స్వాతి రాజు, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు షేక్ అంకుష్, కొండ వెంకన్న, సురేష్ నాయక్, గోసంగి భాస్కర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
