టీడీపీ కార్యకర్తపై దాడి.. వన్‌టౌన్‌లో కేసు నమోదు
టీడీపీ కార్యకర్తపై దాడి.. వన్‌టౌన్‌లో కేసు నమోదు
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పనిచేస్తున్నాడనే ఆరోపణ
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలోని వన్‌టౌన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముల్లా తాజీన్ బాషాపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాడనే కారణంతో వైకాపాకు చెందిన రౌడీషీటర్లు దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితుడు ముల్లా తాజీన్ బాషా ఫిర్యాదు మేరకు, బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వడ్డేగేరి కేవీఆర్ గార్డెన్ సమీపంలో ఆయన వెళ్తుండగా వైకాపా నాయకుడు జలీల్ అహ్మద్తో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జునైద్, ఫైసల్, ఆరిఫ్ అక్కడికి చేరుకుని కర్రలతో దాడి చేయడంతో తాజీన్ బాషా తీవ్రంగా గాయపడి కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు.
గాయపడిన తాజీన్ బాషాను వెంటనే ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు (జీజీహెచ్) తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు కూడా జీజీహెచ్‌కు చేరుకుని చికిత్సకు అడ్డంకులు సృష్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడున్న రోగులు, స్థానికులు జోక్యం చేసుకోవడంతో బాధితుడికి చికిత్స అందినట్లు సమాచారం.
దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై ఇప్పటికే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
