Spa Centers | నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
Spa Centers | నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
- అక్రమ స్పా సెంటర్లపై ఉక్కుపాదం..
- 113 స్పా సెంటర్ల తనిఖీ.. 46 కేసుల నమోదు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: అక్రమ కార్యకలాపాలు, అనధికారిక క్రాస్ మసాజ్ సేవలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సహకారంతో కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన కేంద్రాలపై కేసులు నమోదు చేశారు.
పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 113 స్పా సెంటర్లను పరిశీలించగా, చట్టాలు, ప్రజా భద్రతా నిబంధనలు, నిర్వహణ మార్గదర్శకాలను ఉల్లంఘించిన 46 స్పా సెంటర్ల యజమానులు, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలో ఎల్బీనగర్ జోన్లో 47 స్పా సెంటర్లను తనిఖీ చేసి 17 కేసులు నమోదు చేయగా, ఉప్పల్ జోన్లో 30 స్పా సెంటర్లపై తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి డివిజన్-1 పరిధిలో 17 స్పా సెంటర్లను తనిఖీ చేసి 7 కేసులు, మల్కాజిగిరి డివిజన్-2 (కంటోన్మెంట్) పరిధిలో 19 స్పా సెంటర్లను తనిఖీ చేసి 11 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
చట్టపరమైన చర్యలు…
నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్పా సెంటర్ల నిర్వహణ కోసం భవనాలను అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల పూర్తి వివరాలు, వారి వ్యాపార కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. అక్రమ కార్యకలాపాలకు సహకరించే భవన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా లేదా అక్రమంగా నడుస్తున్న స్పా సెంటర్ల గురించి సమీప పోలీస్ స్టేషన్ లేదా కమిషనరేట్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో, డీసీపీ (రోడ్ సేఫ్టీ) & ఎస్ఓటీ ఇన్చార్జ్ కె. మనోహర్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు.
