మాల కార్పొరేషన్‌కు వెంటనే నిధులు విడుదల చేయాలి
నిరుపేద యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పిడతల వెంకటస్వామి
కర్నూలు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం మాల కార్పొరేషన్‌కు తక్షణమే నిధులు విడుదల చేసి నిరుపేద, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పిడతల వెంకటస్వామి డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ జగదీశ్ మాల్లో ఉన్న మాల మహానాడు ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ మాల కార్పొరేషన్‌కు ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని అన్నారు. నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది నిరుపేద, నిరుద్యోగ మాల యువత ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని మాల కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ ఏడాది మాల యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకు లింక్డ్ సబ్సిడీ రుణాలు, ఎన్ఎస్ఎఫ్డీసీ రుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియకు అనుమతి ఇచ్చి మాలల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా గౌరవ అధ్యక్షుడు జాముల సుంకన్న, విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ బి. మహేష్, జిల్లా యువజన అధ్యక్షుడు మేకల అద్భుత్ కుమార్, చార్లెస్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
