తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న రేవంత్ రెడ్డి: కవిత
తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న రేవంత్ రెడ్డి: కవిత
ఆంధ్ర సీఎం, డిప్యూటీ సీఎం వారానికి మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు
హెచ్‌ఎంఎస్‌తో కలిసి కార్మికుల సమస్యలపై పోరాడతాం
గోదావరిఖని, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలితో తెలంగాణ గౌరవం దెబ్బతింటోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలోని 11 ఇంక్లైన్ గేట్ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇతర రాష్ట్రాల నేతలతో మాట్లాడేటప్పుడు బేలగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. “మహారాష్ట్ర ముఖ్యమంత్రి నా ఫోన్ ఎత్తడం లేదు, లంకె బిందెలు ఉన్నాయని అనుకుని వచ్చాం, కానీ ఖాళీ బిందెలే ఉన్నాయని మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదు” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తీరువల్ల ఇతర రాష్ట్రాల నాయకుల పెత్తనం తెలంగాణలో పెరిగిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారానికి మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తనను తెలంగాణలో అడ్డుకుంటున్నారని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
గతంలో రాజకీయ పార్టీల నేతలు గేట్ మీటింగ్‌లకు వస్తే పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదని, ప్రస్తుతం ప్రభుత్వం గేట్ మీటింగ్‌లకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసి పోలీసులతో అడ్డుకుంటోందని విమర్శించారు.
ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదు
సింగరేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు వెలికితీస్తూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెలుగునిస్తున్నారని కవిత అన్నారు. అలాంటి కార్మికులకు గనుల లోపల కనీస ఆక్సిజన్ కూడా సక్రమంగా అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో నాణ్యమైన భద్రతా బూట్లు అందించేవారని, ప్రస్తుతం నాసిరకం బూట్లు, నాణ్యతలేని గ్లౌజులు ఇస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ జోక్యం సింగరేణిలో పెరిగిందని పేర్కొన్నారు.
శాంతిభద్రతల సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత
కార్మికులను కలిసేందుకు వెళ్లినప్పుడు అడ్డుకుంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కవిత హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు ఏర్పడితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం, పోలీసు శాఖలదేనని అన్నారు. కార్మికుల వద్దకు వెళ్లి గేట్ మీటింగ్‌లు నిర్వహించడాన్ని అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.
హెచ్‌ఎంఎస్‌తో కలిసి పని చేస్తాం
బీఆర్‌ఎస్ హెచ్‌ఎంఎస్‌తో కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని కవిత తెలిపారు. గత 20 ఏళ్లుగా సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడుతున్నానని, ఇకపై కూడా కార్మికుల ఆడబిడ్డగా వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
తల్లి కాంగ్రెస్‌తోనే పోరాడాం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తల్లి కాంగ్రెస్‌తోనే పోరాడి రాష్ట్రాన్ని సాధించామని కవిత అన్నారు. “పిల్ల కాంగ్రెస్‌తో పోరాడటం మాకు పెద్ద విషయం కాదు” అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కవిత స్పష్టం చేశారు.
