తిరువూరు నగర పంచాయతీనా..? పురపాలక సంఘమా..?

తిరువూరు నగర పంచాయతీనా..? పురపాలక సంఘమా..?

గ్రేడ్-2 పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్
మూడు నెలల క్రితమే ఉత్తర్వులు జారీ
ఇప్పటికీ నగర పంచాయతీ బోర్డులే దర్శనం.. కార్యాలయంపై పాత పేరు కొనసాగింపు
అప్‌గ్రేడ్ అమలైందా..? లేదా..?
పట్టణ ప్రజల్లో నెలకొన్న గందరగోళం
అధికారిక గుర్తింపుపై స్పష్టత కోరుతున్న స్థానికులు

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు స్థానిక సంస్థ హోదాపై పట్టణ ప్రజల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్ర పురపాలక శాఖ మూడు నెలల క్రితమే తిరువూరును గ్రేడ్-2 పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటికీ నగర పంచాయతీగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత సంబంధిత కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, ప్రధాన కూడళ్ల వద్ద కొత్త హోదాను ప్రతిబింబించే బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికీ ఎక్కడా అలాంటి మార్పులు కనిపించడం లేదు. తిరువూరు నగర పంచాయతీ కార్యాలయంపై కూడా పాత బోర్డే కొనసాగుతుండటంతో ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారికంగా పురపాలక సంఘంగా మారినట్లయితే దానికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థ, గుర్తింపు, బోర్డులు, అధికారిక పత్రాల్లో మార్పులు ఎందుకు కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అప్‌గ్రేడ్ ప్రక్రియ పూర్తిగా అమల్లోకి వచ్చిందా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పట్టణ అభివృద్ధి, నిధుల కేటాయింపు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాల్లో పురపాలక సంఘ హోదా కీలకమని పేర్కొంటున్న ప్రజలు, ఈ విషయంలో అధికారులు వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. తిరువూరు పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, దానికి తగ్గట్లుగా అన్ని స్థాయిల్లో మార్పులు అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.