కనువిందు చేస్తున్న జలపాతాలు

కనువిందు చేస్తున్న జలపాతాలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారంగా ఖ్యాతిగాంచిన ఉమామహేశ్వర క్షేత్రం శనివారం మరింత సుందరంగా ముస్తాబైంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో క్షేత్ర పరిసర ప్రాంతాల్లోని జలపాతాలు జలజలా పారుతూ భక్తులకు కనువిందు చేశాయి. వర్షపు నీటితో కొండచరియల మధ్య నుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న జలపాతాలు ఉమామహేశ్వర క్షేత్ర సోయగాలను మరింత రెట్టింపు చేశాయి. ప్రకృతి అందాలు, పచ్చని కొండలు, చల్లని వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉమామహేశ్వరంలోని ప్రకృతి వైభవాన్ని తిలకిస్తూ పులకించిపోయారు. పలువురు భక్తులు జలపాతాల వద్ద ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆ అందాలను ఆస్వాదించారు. వర్షాకాలం ప్రారంభంలోనే ఉమామహేశ్వరం ఇలా అలరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని స్థానికులు తెలిపారు.“ఇలాంటి ప్రకృతి అందాలు అరుదుగా కనిపిస్తాయి. ఉమామహేశ్వరం నిజంగా దేవతల నిలయం లాంటిది” అని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.