ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ జిల్లా ప్రతినిధి : ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ వరి సాగుపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు.
నాగర్కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈజీఎస్ పనులు, పశువైద్య ఉచిత టీకా శిబిరాలను పరిశీలించారు.
గ్రామ ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సమావేశంలో గ్రామాభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జొన్న, రాగి వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలు మరియు ఇతర లాభదాయక పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. భారత వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, పరిమిత నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
దేశవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగం పెరుగుతున్నందున వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేపడితే రైతులు మరింత లాభపడగలరని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు అందించే సూచనలు, సలహాలను పాటించాలని సూచించారు.

రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుపోషణ, ఉద్యానవనం, చేపల పెంపకం వంటి రంగాలపై కూడా దృష్టి సారించాలని కోరారు. రైతుల ఆదాయ వృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని హామీ ఇచ్చారు.
భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు చేయడంతో పాటు అనర్హులైన వారి పేర్ల తొలగింపునకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
అనంతరం గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి పనులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రహదారులు తదితర అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాభివృద్ధికి ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మండల స్థాయి అధికారులు సమయపాలన పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి, మండల అధికారులు, గ్రామపంచాయతీ సభ్యులు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
