మాలలకు రోస్టర్ విధానంలో న్యాయం చేయాలి
అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఎస్సీ గ్రూప్-3లో ఉన్న మాల, మాల ఉపకులాలకు రోస్టర్ విధానంలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని అచ్చంపేట మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ది నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మన్నె శ్రీధర్‌ను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ గ్రూప్-3లో మాల, 25 మాల ఉపకులాలకు సంబంధించిన మొదటి రోస్టర్ పాయింట్‌ను ప్రస్తుతం ఉన్న 25వ స్థానం నుంచి 16వ స్థానానికి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
మాలలకు జరిగిన నష్టంపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టంలో అవసరమైన సవరణలు చేపట్టి రోస్టర్ విధానంలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల జారీని నిలిపివేయాలని కోరారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ శాతాన్ని పెంచి మాల, మాల ఉపకులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలవుతున్న ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానంపై ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు అనిల్, సహదేవ్, స్వామి, సత్యం, వేదవ్యాస్, వెంకటేష్, చందు, బాల్‌చంద్ర, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
