ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

టేకుమట్ల, ఆంధ్రప్రభ: ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి అవసరమైన రహదారులు, మహిళా సంఘ భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు స్థానిక అవసరాల ఆధారంగా నిధులు మంజూరు చేసి పనులు చేపడతామని తెలిపారు. పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.

ప్రజలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. వానాకాలం నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని సూచించారు. భూసారాన్ని కాపాడుతూ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పంగిడిపల్లి సర్పంచ్ గంధం సారయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, మండలాధికారులు తహసీల్దార్ స్వరూప రాణి, ఎంపీడీవో సురేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.