వార్డు సభలతోనే పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యం
వార్డు సభలతోనే పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యం
- మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్
నర్సంపేట, ఆంధ్రప్రభ: వార్డు సభల ద్వారానే పట్టణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 8, 17, 19, 20 వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు గత ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారికి మరోసారి వార్డు సభల ద్వారా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మున్సిపాలిటీ అందజేసిన తడి–పొడి చెత్త డబ్బాలను వినియోగిస్తూ ఇంటి వద్దనే చెత్తను వేరు చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు.
నర్సంపేట పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని, మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు శ్రీరామోజు రోజా రాణి, ఎండి అయూబ్ ఖాన్, ఎలకంటి విజయ్ కుమార్, దొంగల రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
