న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రజలు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ధీరజ్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని భోజ్యా తండాలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రహదారి భద్రత, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఎన్‌డీపీఎస్ యాక్ట్, సైబర్ క్రైమ్ యాక్ట్‌లపై ప్రత్యేకంగా చర్చించారు.

ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి ధీరజ్ కుమార్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇది కేవలం పోలీసుల కోసం కాదని, స్వీయ ప్రాణ రక్షణ కోసం అవసరమని తెలిపారు. ప్రతి పౌరుడు ప్రాథమిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం సాగించాలని కోరారు.

రహదారి నిబంధనలు పాటిస్తూ మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు. “ఒక చిన్న నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు తగిలే గాయాల నుండి రక్షణ లభిస్తుంది” అని పేర్కొన్నారు.

అలాగే ఆడపిల్లలకు 18 సంవత్సరాలు పూర్తయ్యాకే వివాహం జరపాలని సూచించారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి. రత్నం, అడ్వకేట్లు జి. రామకృష్ణ, ఎం. నాగరాజు, ఎం. అశోక్, ఎం. సంతోష్, టి. గౌస్, రమేష్, సర్పంచ్ మౌనిక, తొర్రూరు ఎస్సై శివరామకృష్ణ, కోర్టు సిబ్బంది మరియు తండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply