బొగ్గు కుంభకోణాలు బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నేతలపై కేసులు

బొగ్గు కుంభకోణాలు బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నేతలపై కేసులు

-బాల్క సుమన్‌ను అన్యాయంగా జైలుకు పంపారు
-రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌పై ఎందుకు కేసులు పెట్టలేదు?
-బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణాలను బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం చంచల్‌గూడ జైలులో మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

సింగరేణిలో రూ.15 వేల కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిందని కేటీఆర్ అన్నారు. అలాగే రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు కనిపించకుండా పోయిన విషయాన్ని తమ పార్టీ నేతలు ప్రజల దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతో బాల్క సుమన్‌పై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌ను పేల్చివేయాలని వ్యాఖ్యానించినప్పుడు ఎందుకు కేసు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి తగలబెడతానని వ్యాఖ్యానించినప్పుడు ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ నాయకుడు రెడ్డి ఫ్యాక్టరీని పెట్రోల్ పోసి తగలబెడతానని ప్రకటించినప్పటికీ కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు.

జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించిన సమయంలో, తన గురించి ఆలోచించవద్దని, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై కార్మికుల పక్షాన పోరాటం కొనసాగించాలని సుమన్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఉద్యమ సమయంలో బాల్క సుమన్‌పై 220 కేసులు నమోదయ్యాయని, పలుమార్లు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ప్రజల పక్షాన పోరాడి జైలుకు వెళ్లడం సుమన్‌కు కొత్త కాదని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, అవినీతిని ఎప్పటికప్పుడు బయటపెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.