నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు
బస్సులో దొరికిన పర్సును బాధిత మహిళకు అప్పగింత
నందిగామ, ఆంధ్రప్రభ: పోలీసులు అంటే భద్రతతో పాటు నిజాయితీకి కూడా మారుపేరని నందిగామ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. బస్సులో దొరికిన పర్సును బాధిత మహిళకు సురక్షితంగా అందజేసి ప్రశంసలు అందుకున్నారు.
బస్సులో దొరికిన పర్సు
నందిగామ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, రవితేజ, శివరామకృష్ణ విజయవాడ బందోబస్తు విధులకు వెళ్తుండగా బస్సులో ఒక పర్సు దొరికింది. బందోబస్తు విధులు పూర్తి చేసుకుని తిరిగి నందిగామకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ట్రాఫిక్ ఎస్ఐ నరేష్‌కు తెలిపారు.
పర్సులో నగదు, డాక్యుమెంట్లు
ఆ పర్సులో రూ.6 వేల నగదుతో పాటు విలువైన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు ఉన్నాయి. ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా పోలీసులు బాధితురాలికి ఫోన్ చేసి సమాచారం అందించారు.
పర్సు దొరకదని భావించిన బాధితురాలు
విజయవాడకు చెందిన విజయభారతి అనే మహిళ జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. నందిగామలో ఒక పని నిమిత్తం బస్సు దిగిన కొద్దిసేపటికి పర్సు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. పర్సు ఇక దొరకదని భావించి బాధతో ఇంటికి వెళ్లిపోయింది.
పోలీసుల ఫోన్‌తో ఆనందం
నందిగామ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ నుంచి ఫోన్ రావడంతో విజయభారతి ఆనందం వ్యక్తం చేసింది. బుధవారం ఉదయం నందిగామ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన పర్సును తీసుకుంది. ట్రాఫిక్ పోలీసుల నిజాయితీ, అంకితభావం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
కానిస్టేబుళ్లకు అభినందనలు
నిజాయితీగా వ్యవహరించి పర్సును బాధితురాలికి అందేలా చేసిన కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, రవితేజ, శివరామకృష్ణలను ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ప్రత్యేకంగా అభినందించారు.
