Blade Gang | తండ్రి, కుమారుడిపై దారుణ దాడి

గొంతులు కోసిన దుండగులు..
బాలుడి పరిస్థితి విషమం…
గంజాయి మత్తులో దాడి చేశారన్న స్థానికుల ఆరోపణలు
దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు

Blade Gang | కృష్ణ‌లంక‌, ఆంధ్ర‌ప్ర‌భ : విజయవాడ కృష్ణలంకలో సోమవారం రాత్రి బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. కరకట్టపై శిశుభవన్ సమీపంలో ఓ కుటుంబానికి చెందిన తండ్రి, కుమారుడిపై దుండగులు బ్లేడ్‌లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణలంకకు చెందిన భాను, ఆయన కుమారుడిపై చెక్క కుమార్ అనే వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేసినట్లు సమాచారం.

ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, ముఖ్యంగా బాలుడి గొంతు భాగంలో తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే కృష్ణలంకలోని శ్రీరామ్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఘటనకు గంజాయి మత్తులో తిరిగే బ్లేడ్ బ్యాచ్ సభ్యులే కారణమన్న ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.