డీఎస్సీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి..

నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దుబహిరంగ చర్చకు సిద్ధం

శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు

విజయవాడ, ఆంధ్రప్రభ: డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేయడం సరికాదని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీ మేరకు 16,300కు పైగా ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించిందని పేర్కొన్నారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం పలు కేసులను కోర్టుల్లో దాఖలు చేసిందని ఆరోపించారు.

అయితే ప్రభుత్వం, న్యాయ నిపుణుల సమన్వయంతో అన్ని అడ్డంకులను అధిగమించి నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు.

స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని రవినాయుడు స్పష్టం చేశారు. క్రీడా సర్టిఫికెట్లను స్పోర్ట్స్ అథారిటీ జారీ చేయదని, సంబంధిత క్రీడా సంఘాలు, సమాఖ్యల ద్వారానే అవి జారీ అవుతాయని వివరించారు.

నియామక ప్రక్రియ మొత్తం అధికారుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి పారదర్శకతతో జరిగిందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఎవరైనా ఆధారాలతో ముందుకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, రాబోయే నియామక పరీక్షలకు యువత సిద్ధం కావాలని సూచించారు. నిరుద్యోగుల సంక్షేమం, ఉపాధి కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అనిమిని రవినాయుడు పేర్కొన్నారు.

Leave a Reply