Telangana Politics | తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం

Telangana Politics | తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం
Telangana Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన’ రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, తెలంగాణ అస్తిత్వం, ఉద్యమ ఆశయాలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీ అధికార కూటమి నేతలు, తెలంగాణలో పెరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘ఇది టీఆర్ఎస్ 2.0.. మాతో పెట్టుకుంటే మంచిది కాదు’
సమావేశంలో మాట్లాడిన కవిత, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒకసారి పోరాడి సాధించుకున్నామని, అవసరమైతే మరోసారి అదే స్థాయిలో ఉద్యమం చేయడానికి వెనుకాడబోమన్నారు.
తెలంగాణ అస్తిత్వంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, కొందరు రాజకీయ నాయకులు తెలంగాణ సంస్కృతి, చరిత్రను పక్కనబెట్టి ఇతర ప్రాంతాల రాజకీయ అజెండాలను ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించకుండా వ్యవహరిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని కవిత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఉద్యమకారుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు.
రేపు జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్యమకారుల డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తులకు మాత్రమే న్యాయం జరిగితే సరిపోదని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ న్యాయం జరగాలన్నారు.
ఏపీ నేతలపై విమర్శలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు గడిచినా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కీలక సమస్యలు పరిష్కారం కాలేదని కవిత వ్యాఖ్యానించారు. ఆ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తెలంగాణలో రాజకీయ వివాదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహించే ముందు గతంలో తెలంగాణ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేదన్నారు.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే లక్ష్యం
తెలంగాణ ఉద్యమం కేవలం రాష్ట్ర సాధనతో ముగిసిపోలేదని, రాష్ట్ర ఆత్మగౌరవం, సంస్కృతి, హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
