కంటి ఆరోగ్యంలో రెడ్‌క్రాస్ సేవలు ప్రశంసనీయం

కంటి ఆరోగ్యంలో రెడ్‌క్రాస్ సేవలు ప్రశంసనీయం

శంక‌ర నేత్రాల‌య ద్వారా అత్యున్నత కంటి సంరక్షణ సేవలు
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : పేద‌ల కంటి ఆరోగ్య పరిరక్షణలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని.. శంకర నేత్రాలయ సహకారంతో రెడ్‌క్రాస్ నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు, చికిత్స సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ శాఖ‌.. శంక‌ర నేత్రాల‌య (మొబైల్ ఐ స‌ర్జిక‌ల్ యూనిట్‌), సి.ర‌త్న‌మాంబ‌, డీవీఎస్ మూర్తిల‌ జ్ఞాపకార్థం డా. అప‌ర్ణ‌, డా. మాధ‌వ్ దుర్బా స‌హ‌కారంతో సోమ‌వారం ఎస్ఆర్ఆర్‌, సీవీఆర్ ప్ర‌భుత్వ క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప్రారంభించారు.

ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కు ఈ శిబిరంలో కంటిపొర ప‌రీక్ష‌ల సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని, ఈ నెల 18 నుంచి 22 వ‌ర‌కు శ‌స్త్ర‌చికిత్స‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రెడ్‌క్రాస్ ప్ర‌తినిధులు తెలిపారు. కంటి శుక్లం ఉన్నవారికి ఈ శిబిరంలోనే శ‌స్త్ర‌చికిత్స చేయ‌డం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. శ‌స్త్ర‌చికిత్స జ‌రిగిన వారికి ఐవోఎల్ లెన్స్‌, కంటి అద్దాలు, మందులను ఉచితంగా ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సేవ‌లు అవ‌స‌ర‌మైన వారు 94400 29999, 93930 97373 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చన్నారు.

కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చన్నారు. ముఖ్యంగా పేద‌లకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించడంలో రెడ్‌క్రాస్, శంకర నేత్రాలయ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శిబిరంలో నిపుణులైన వైద్యులు కంటి పొర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ ల‌క్ష్మీశ‌ సూచించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మ‌న్ డా. జి.స‌మ‌రం, వైస్ ఛైర్మ‌న్ డా. వెల‌గా జోషి, సెక్ర‌ట‌రీ ఇ.చిట్టిబాబు, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ జూనియ‌ర్ క‌ళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.