మెట్ట పంటల వైపు రైతులు దృష్టి సారించాలి..

శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగు విధానాలు మార్చుకోవాలి
జిల్లాలో ఎల్ నినో పై విస్తృత ప్రచారం
రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల, పారిశ్రామిక, భూగర్భ వనరుల శాఖ మంత్రి మెదక్ జిల్లా ఇంచార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎల్ నినో ప్రభావంతో రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల, పారిశ్రామిక, భూగర్భ వనరుల శాఖ మంత్రి మెదక్ జిల్లా ఇంచార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా చేగుంట మండలంలో మంత్రి పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతు వేదికలో ఎల్ నినో వ్యవసాయ శాఖ అవగాహన సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికల మేరకు రైతాంగం సాంప్రదాయ సాగు చేయకుండా, మారుతున్న ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం కావాలన్నారు. అధిక నీటి వినియోగం ఉండే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటి అవసరాలతో చేతికొచ్చే పంటల వైపు దృష్టి సారించాలన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం అత్యంత ఆవశ్యకమని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో అనుకున్నంత వర్షపాతం నమోదు కాలేదని భూగర్భ జలాలు వరి పంటకు అనుకూలంగా లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఎల్ నినో ప్రభావం ఉంటుందని రైతులకు విస్తృత ప్రచారం కల్పించిందన్నారు.

అవగాహన లేమితో రైతులు వరి పంటను పండిస్తున్నారని ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలన్నారు. ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి అని, ఇప్పటికే రైతు భరోసా అందించి అన్నదాతలకు అండగా నిలిచామని స్పష్టం చేశారు. అంతకుముందు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఆరుతడి పంటలపై సబ్సిడీ విషయంలో సానుకూల దృష్టితో వ్యవహరించాలని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు సమావేశ వేదికగా తమ వాదనలను మంత్రికి విన్నవించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. వరి వద్దు ప్రత్యామ్నాయ పంటలే ముద్దు అనే నినాదంతో జిల్లాలో రైతులకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన మేరకు జిల్లాలోని అన్ని రైతు కేన్ వేదికలలో ఎల్ నినో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రైతులందరూ వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో బావయ్య, డిడబ్ల్యుఓ హేమభార్గవి, జిల్లా వ్యవసాయ అధికారి, ప్రజా ప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.