ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి ఏఈవో ప్రశాంతి, పెద్ద జట్రం ఏఈవో స్వప్న
గ్రామాల్లోశనివారం రైతులకు ఎల్ నినో ప్రభావంపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నేలలో తేమను సంరక్షించే విధానాలను పాటించాలని, అవసరమైనప్పుడు మాత్రమే శాస్త్రీయ పద్ధతిలో నీటిని వినియోగించాలని సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే జొన్న సజ్జ రాగి పెసర కంది తదితర పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, ఎరువుల నిర్వహణ వంటి అంశాల్లో రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, వ్యవసాయ శాఖ సూచనలను అనుసరిస్తూ పంటల నిర్వహణ చేపడితే నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.