శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత

బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఆషాఢ మాసం సందర్భంగా బిక్కనూర్‌లోని శ్రీ రేణుకా మాత ఆలయంలో శనివారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలతో శాకాంబరీ దేవి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. హైదరాబాద్‌లో న్యాయవాదిగా సేవలందిస్తున్న బిక్కనూర్‌కు చెందిన మునిగల్ల నాగరాజు గౌడ్ కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శ్రీ రేణుకా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శాకాంబరీ అలంకరణ చేయించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
ఆషాఢ మాసంలో శాకాంబరీ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకాంబరీ రూపంలో కొలువుదీరిన శ్రీ రేణుకా మాత దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు.
శాకాంబరీ అలంకరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, అమ్మవారి దివ్య దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సమృద్ధిగా వర్షాలు పడే పంటలు పండాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు శాకాంబరి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు కనులారా తిలకించారు.