Shadi Khana | వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలి
Shadi Khana | వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలి
వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
ముస్లింల చిరకాల స్వప్నాన్ని వైసీపీ ప్రభుత్వం సాకారం చేసిందన్న అవినాష్
రూ.2.5 కోట్లతో నిర్మించిన షాదీ ఖానాకు ఇంకా తాళాలేనా? అంటూ ప్రశ్న
తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల ఆందోళన
రాజకీయాలు పక్కనపెట్టి మైనారిటీల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని డిమాండ్
Shadi Khana | విజయవాడ – ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీల చిరకాల కోరిక అయిన షాదీ ఖానాను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. షాదీ ఖానాను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు ఆదివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ముస్లిం నాయకుల విజ్ఞప్తి మేరకు షాదీ ఖానా నిర్మాణానికి ఆమోదం లభించిందన్నారు. స్థల వివాదాలు, సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించడంతో పాటు దశలవారీగా నిధులు మంజూరు చేసి దాదాపు రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయని, తమ నిరంతర పోరాటాల ఫలితంగానే మిగిలిన పనులు పూర్తి చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ తాళాలు వేసి ఉంచడం మైనారిటీల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

తూర్పు నియోజకవర్గంలో రహదారులు, పార్కులు, వాటర్ ట్యాంకులు, కృష్ణాలంక రిటైనింగ్ వాల్, గుణదల కొండ అభివృద్ధి వంటి అనేక పనులు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టినవేనని అవినాష్ తెలిపారు.
రాజకీయ కక్షసాధింపులకు తావులేకుండా అధికారులు, మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి షాదీ ఖానాను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ మైనారిటీ విభాగం నాయకులు, పార్టీ ప్రతినిధులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.
