IPL Weather | ఐపీఎల్ ఫైనల్‌పై వర్షం ముప్పు..

IPL Weather | ఐపీఎల్ ఫైనల్‌పై వర్షం ముప్పు..

IPL Weather | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు అభిమానులను ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఇవాళ అహ్మదాబాద్‌లో జరగనున్న టైటిల్ పోరుపై వర్షం ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసినట్లు సమాచారం. దీంతో మైదానాన్ని రక్షించేందుకు స్టేడియం సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా మొత్తం గ్రౌండ్‌ను ప్రత్యేక కవర్లతో కప్పివేశారు. సోషల్ మీడియాలో కూడా స్టేడియం వద్ద వర్షం కురిసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

భారత వాతావరణ శాఖ (IMD) అహ్మదాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం కూడా మేఘావృత వాతావరణం కొనసాగే అవకాశముండటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.ఇవాళ మ్యాచ్ పూర్తిగా నిర్వహించడం సాధ్యంకాకపోతే, బీసీసీఐ ఇప్పటికే రిజర్వ్ డేగా సోమవారం (జూన్ 1)ను కేటాయించింది. వర్షం కారణంగా ఫైనల్ నిలిచిపోయినా లేదా పూర్తి కాకపోయినా, మిగిలిన మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున కొనసాగిస్తారు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం ముందుగా అదే రోజున మ్యాచ్‌ను పూర్తి చేయడానికి అధికారులు అదనపు సమయాన్ని వినియోగిస్తారు. అవసరమైతే ఓవర్లను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కనీసం ఒక్కో జట్టు ఐదు ఓవర్లు ఆడితే ఫలితాన్ని నిర్ణయించవచ్చు. ఒకవేళ ఆదివారం, రిజర్వ్ డే అయిన సోమవారం రెండురోజులూ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించడం అసాధ్యమైతే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ప్రయోజనం RCBకు అనుకూలంగా ఉంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అయితే ఇప్పుడు అందరి చూపు వాతావరణంపైనే నిలిచింది. అభిమానులు మాత్రం వర్షం దూరంగా ఉండి పూర్తి మ్యాచ్ జరిగాలని ఆశిస్తున్నారు

Leave a Reply