పరిశ్రమల వేగానికి కొత్త దిశ…
పరిశ్రమల వేగానికి కొత్త దిశ…
కలెక్టర్ కీలక ఆదేశాలు
విజయవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులు జారీ చేస్తూ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.
శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జరిగింది. పరిశ్రమల అనుమతులు, ప్రోత్సాహకాలు, వివిధ పారిశ్రామిక పథకాల అమలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని, ఆ వేగానికి అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పెట్టుబడిదారులకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తోందని స్పష్టం చేశారు.
‘స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనలో పరిశ్రమల అభివృద్ధి కీలకమని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, MSME పార్కులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. వీటిని త్వరితగతిన పూర్తి చేసి పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తాజా సమావేశంలో వివిధ పారిశ్రామిక ప్రోత్సాహక పథకాల కింద 26 క్లెయిమ్‌లకు రూ.3.48 కోట్ల ప్రోత్సాహకాలను ఆమోదించినట్లు తెలిపారు.
‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. PMEGP, PM Vishwakarma పథకాల అమలును వేగవంతం చేయాలని సూచించారు.
ప్రైవేట్ రంగంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాన్ని వినియోగించుకుని పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల అధికారి ఎం. మధు, APIIC జోనల్ మేనేజర్ బాబ్జీ, ఫ్యాప్సియా ప్రతినిధులు వాసిరెడ్డి మురళీకృష్ణ, కనకదుర్గ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
