విజయవాడలో ‘కాలగమనం’ చిత్ర యూనిట్ సందడి

విజయవాడలో ‘కాలగమనం’ చిత్ర యూనిట్ సందడి

కేదారేశ్వర పేట, ఆంధ్రప్రభ : ‘కాలగమనం’ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న జయరాం థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన యూనిట్ సభ్యులు, సినిమా విజయోత్సాహాన్ని అభిమానులతో పంచుకున్నారు. థియేటర్ ఎదుట సంబరాలు నిర్వహించి, తీన్మార్ డప్పులతో నృత్యాలు చేస్తూ అలరించారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సుధాకర్ మాట్లాడుతూ, రెండేళ్లపాటు శ్రమించి ఈ సినిమాను రూపొందించానని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ప్రేమకథకు ప్రేక్షకులు విశేష ఆదరణ చూపడం ఆనందంగా ఉందన్నారు. చిన్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రంలో క్లైమాక్స్ కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని సూచించారు.

సినిమాలో అధిక శాతం నటీనటులు విజయవాడకు చెందినవారేనని, తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ, తాను విజయవాడకు చెందినవారినని, పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన అనంతరం దర్శకుడు సుధాకర్ తనకు హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చారని చెప్పారు.

సినిమా అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, ప్రేమకథను దర్శకుడు కొత్తగా తెరకెక్కించారని, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు. నటులు చినబాబు, దుర్గా, తిరు మాట్లాడుతూ, ‘కాలగమనం’ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నటీనటులు రామ్, బ్రహ్మం, బుచ్చిరాజు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply