మహిళా రిజర్వేషన్‌పై టీడీపీ నిర్ణయం…

మహిళా రిజర్వేషన్‌పై టీడీపీ నిర్ణయం…

తిరువూరులో పాలాభిషేకం

తిరువూరు, ఆంధ్రప్రభ రూరల్ : మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన 33 శాతం మహిళా రిజర్వేషన్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా శనివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

గతంలో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించారని, చంద్రబాబు నాయుడు దీపం పథకం, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థిక బలోపేతానికి పునాది వేశారని తెలిపారు. ఇప్పుడు నారా లోకేష్ 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.

ఈ నిర్ణయంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళల భాగస్వామ్యం పెరిగి నాయకత్వ అవకాశాలు మరింత విస్తరించనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నాయకులు భూమా స్వాతి, నవ్య మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీనేనని తెలిపారు. లోకేష్ నిర్ణయంతో మహిళల్లో కొత్త ఉత్సాహం నెలకొందని అన్నారు.

మీడియా సమావేశం అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు, కార్యకర్తలు కలిసి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.