42.2 degrees | వచ్చే మూడు రోజులు వానలే
42.2 degrees | వచ్చే మూడు రోజులు వానలే
గ్రేటర్ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్
కూల్ వెదర్‌తో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
సాయంత్రం వేళల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులుండే చాన్స్
42.2 degrees | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఎండల సెగ తగ్గుముఖం పట్టనుంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. మే 29 (శుక్రవారం) వరకు నగరానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేస్తూ ఐఎండీ నిర్ణయం తీసుకుంది.

ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. కొద్ది రోజులుగా భానుడు భగభగలాడుతూ చుక్కలు చూపించాడు. హైదరాబాద్‌లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే, మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు సీన్ మార్చేశాయి. సికింద్రాబాద్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ఏరియాల్లో వాతావరణం చల్లబడటంతో జనం హమ్మయ్య అనుకుంటున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది.
42.2 degrees | ఇతర జిల్లాలలో కూడా..

హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి సహా 20కి పైగా జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. బలమైన గాలుల వల్ల చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, వర్షం పడే సమయంలో బయట తిరగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఆఫీసులకి వెళ్లేవారు లేదా పనుల మీద బయట తిరిగేవారు తమ షెడ్యూల్‌ను వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం బెటర్. సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి వెంట గొడుగు లేదా రెయిన్ కోట్ ఉంచుకోవడం మంచిది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో వైరల్ ఫీవర్లు వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
CLICK HERE TO READ MORE : 500 people | కళ్లముందేమో మురుగునీరు
