AP CM | చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు

AP CM | చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు
‘బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ’
AP CM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కానీ… ‘బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ’ అని రుజువైందని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మాట్లాడిన జగన్.. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ మేనిఫెస్టోను పూర్తిగా పక్కనపెట్టారని వ్యాఖ్యానించారు.
సూపర్-6, సూపర్-7 హామీలు అమలు కాలేదని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారం మోపుతున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర పన్నులు తగ్గించి ధరలు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన జగన్.. “గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు” అన్నారు. ప్రజలను అమాయకులుగా భావించవద్దని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
