Windstorm | అర్ధ‌రాత్రి నుంచి ఈదురుగాలితో వాన‌

Windstorm | అర్ధ‌రాత్రి నుంచి ఈదురుగాలితో వాన‌

ఏపీ, తెలంగాణలో పంట‌ల‌కు భారీ న‌ష్టం
కొనుగోలు కేంద్రాల్లో త‌డిసిన మ‌క్క‌లు, వ‌డ్లు
వాన‌కు కొట్టుకుపోయిన ఆర‌బోసిన వ‌డ్లు
అన్న‌దాత‌ల క‌ళ్ల‌లో క‌న్నీళ్ల సెల‌యేళ్లు
త‌డిసిన వ‌డ్లు కొని ఆదుకోవాలని వేడుకోలు

హైద‌రాబాద్ / అమ‌రావ‌తి, ఆంధ్ర‌ప్ర‌భ : Windstorm | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంగ‌ళ‌వారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ధాన్యం తడిసిపోవడం, మామిడి తోటలు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షం, ఈదురు గాలులతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ అంతరాయాలు, చెట్లు కూలిపోవడం, పంటలు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. తమ పంటలకు అపార నష్టం వాటిళ్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో.. ఒక‌రి మృతి

చిత్తూరు జిల్లాలో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కార్వేటినగరం మండలంలో పిడుగుపాటుకు వెంకటస్వామి అనే వ్యక్తి మృతిచెందారు. పాతపాలెంలో కారుపై చింత చెట్టు కూలింది. ఉద్యాన పంటలైన బొప్పాయి, మామిడికి అపార నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలో..
కదిరిలో సుమారు నాలుగు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోకి నీరు చేరింది.

ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో..
జగ్గయ్యపేట, నరసరావుపేట పరిసరాల్లో గాలివాన ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ములకలూరు – సత్తెనపల్లి మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి.

చిలకలూరిపేట..
దండముడి గ్రామంలో ఈదురుగాలుల తీవ్రతకు సోలార్ ప్లేట్లు ఎగిరిపడి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలైన విషాద ఘటన చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లాలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాన ధాటికి పలు కాలనీలు జలమయం అవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ ఈదురు గాలులు వీచాయి. నెల్లూరు నగరంతో పాటు అనేక మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చేజర్ల మండలంలో రెండు గంటలకు పైగా విద్యుత్ అంతరాయం కొనసాగగా, కోవూరులో నాలుగు గంటల‌పాటు కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బోగోలు మండలంలో పెనుగాలుల కారణంగా మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగి రహదారులపై పడటంతో రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోవడంతో కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా వచ్చిన గాలివానతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో..
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి, కొల్చారం, వెల్దుర్తి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షం కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో నిన్న(మంగళవారం) రాత్రి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామంలో మహాలక్ష్మి ఆలయం వెనుక ఉన్న తాటిచెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు.

సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో కూడా పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. దుబ్బాక మార్కెట్ యార్డుతో పాటు పలు ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే మార్కెట్‌లో ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఇప్పుడు వర్షాల కారణంగా పంట నష్టపోవడం రైతులకు మరింత భారంగా మారింది.

Leave a Reply