సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూమి సమస్యపై అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ దంపతులు సచివాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
సిద్ధిపేట జిల్లా కొండా పోచమ్మపల్లి గ్రామానికి చెందిన పుట్ట కృష్ణయ్య, ఆయన భార్య సైదమ్మ తమ భూమికి సంబంధించిన సమస్యపై న్యాయం కోసం గత మూడు రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తమ వినతిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
భూమి విషయంలో న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు పెట్రోల్ డబ్బాతో సెక్రటేరియట్ వద్దకు చేరుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ (SPF) పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
దంపతుల చేతిలో ఉన్న పెట్రోల్ డబ్బాను లాక్కొని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తర్వాత దంపతులను విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి భూమి సమస్యకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు
దంపతుల నుంచి సమస్యకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు, సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భూమి వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత దంపతులు కోరుతున్నారు.సచివాలయం వద్ద జరిగిన ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు వెంటనే స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
