నాకే అబద్ధాలా.. అధికారుల తీరుపై గొట్టిపాటి ఆగ్రహం

నాకే అబద్ధాలా.. అధికారుల తీరుపై గొట్టిపాటి ఆగ్రహం

భీమవరం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మంత్రి నైనా నాకే అబద్ధాలు చెబుతారా” అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి సోమవారం ప్రారంభించారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడి ఎస్సీ కాలనీలో సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్‌ల వివరాలను మంత్రి అధికారులను అడిగారు. మొత్తం 150 మందికి మంజూరు కాగా ఇప్పటివరకు 25 మాత్రమే ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ అధికారి పులి ఉషారాణి తెలిపారు. అయితే గ్రామంలో కేవలం 5 మాత్రమే కనిపించడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

“మంత్రి కే అబద్ధాలు చెబుతుంటే గ్రామస్థాయిలో పనితీరు ఎలా ఉంటుంది” అంటూ అధికారులపై మండిపడ్డారు. లబ్ధిదారులకు వెంటనే పూర్తి స్థాయిలో సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం, తప్పుదారి పట్టించే సమాచారం ఇక సహించబోమని హెచ్చరించారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణాలకు రూ. 6,000 కోట్ల ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత రెండేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచలేదని చెప్పారు.

విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని, వినియోగదారుల ఫిర్యాదులకు అధికారులు త్వరితగతిన స్పందించాలని సూచించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.