వేసవి వేడిలో ప్రయాణికులకు నీరు, నీడ సదుపాయాలు పెంచాలి

ప్రయాణికులకు నీరు, నీడ సదుపాయాలు పెంచాలి
విజయవాడ(బస్టాండ్) ఆంధ్రప్రభ : వేసవి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులకు తాగునీరు, నీడ, పారిశుద్ధ్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.
సోమవారం నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్‌బీఎస్)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్ స్టేషన్‌లో స్వచ్ఛమైన తాగునీటి ఏర్పాట్లు, నీడ సదుపాయాలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బస్ స్టేషన్‌లో అవసరానికి అనుగుణంగా తాగునీటి పాయింట్లను పెంచాలని ఆదేశించారు. తాగునీటి లభ్యతకు సంబంధించి సూచిక బోర్డులు స్పష్టంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. స్టాళ్లు, వ్యాపార సంస్థలు కూడా సామాజిక బాధ్యతగా ప్రయాణికులకు తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు.
ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా శానిటేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు.
ఈ తనిఖీలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి. సాయి చరణ్ తేజ, బస్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు.
