AP | వచ్చేది మన ప్రభుత్వమే…

సిండికేట్ ను కూకటి వేళ్ళతో తొలగిస్తాం
మా హయాంలో వరుసగా రెండేళ్లు బెస్ట్ మెరైన్ అవార్డు అందుకున్నాం
చంద్రబాబు అధికారం సిండికేట్లకు పండగే..
ఆక్వా రైతుల కోసం అప్సడా తెచ్చా..
చంద్రబాబు ప్రతి అడుగు మోసమే
నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీ నిలిపేశారు ..


భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : మీ కష్టాలు నాకు తెలుసు.. మీ అందరికీ నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నా, చూస్తూ చూస్తూనే రెండేళ్లు పూర్తయ్యాయని మరో మూడేళ్లలో మన రైతు ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బైపాస్ రోడ్ లోఅక్వా రైతులతో బుధవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… కూటమి పాలనలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని, రైతులకు విద్యుత్ రాయితీ లేదని విద్యుత్ కోతలతో ఆక్వా రైతులు నష్టపోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనత వల్ల అక్వా రంగం సుడిగుండంలో చిక్కుకుందన్నారు. ఫీడ్, సీడ్ కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి రైతులను ఇష్టానుసారం దోచేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే అని, రైతన్నలకు కన్నీరే మిగులుతుందన్నారు.

రైతుల అంగీకారం లేకుండానే ఇష్టానుసారంగా ఫీడ్ సీడ్ ధరలు పెంచుతున్నారు అన్నారు. రాష్ట్రంలో ఆక్వారంగం 15 లక్షల మంది రైతులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ విఫలం అవుతున్నారన్నారు. ఆక్వా జోనులతో సంబంధం లేకుండా విద్యుత్ రాయితీ ఇవ్వలేదని, ఫీడ్ ధరలు తగ్గించలేదన్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్గా ఏర్పడ్డారని, ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే పెంచుతారు అన్నారు వారి చేతుల్లో ఆక్వా రైతులు నలిగిపోతున్నారన్నారు. జనరేటర్ల పై ఆధారపడి రైతులు ఆక్వా సాగు చేయాల్సిన దుస్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉండటం లేదన్నారు త్రీఫేజ్ కరెంటు స్థానంలో సింగల్ ఫేస్ కరెంటు ఇస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు.

ఆక్వా రైతుల కోసం అప్సడా తెచ్చా..

రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం హయాంలో అప్సడా చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ చట్టం ప్రకారం ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటూ రైతులకు మంచి చేసే అవకాశం కల్పించామన్నారు. మా హయాంలో ఐదేళ్లలో మూడుసార్లు ఫీడ్ రేట్లు పెంచుతామని చూస్తే పెంచకుండా చేశామన్నారు.
సీడ్, ఫీడ్ మార్కెటింగ్లో సమస్యలు వస్తే పరిష్కరించామన్నారు. అక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ అందించాం. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశామన్నారు. ఐదేళ్లలో సబ్సీడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించాం. ఇందులో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల బకాయిల్ని మేమే చెల్లించాం. రాష్ట్రంలో 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసాం. ఆక్వా రైతులకు సహాయం అందించేందుకు 750 ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించాం.2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఆక్వా ఎగుమతుల విలువ 13 వేల కోట్లు ఉంటే మా హయాంలో అక్వా ఎగుమతుల విలువ రూ.20 వేల కోట్లకు తీసుకువెళ్లామన్నారు. వరుసగా రెండేళ్ల పాటు 2022, 2023 సంవత్సరాల్లో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నాం అని జగన్ గుర్తు చేశారు. ఏపీలో అక్వా రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని కేజీ రొయ్య కౌంట్ రూ.230 దాటని పరిస్థితి నెలకొందన్నారు. నాలుగు నెలల్లో ఫీడ్ ధరలను కేజీకి రూ. 14-16 రూపాయిలు ఎడా పెడా పెంచేశారని ఆరోపించారు. ఏకపక్షంగా ధరలు పెంచుకుంటూ పోతుంటే చంద్రబాబు మాత్రం వాటిని నియంత్రించకుండా చోద్యం చూస్తున్నారు అన్నారు.
ఫీడ్ తయారీకి సంబంధించిన ముడి సరుకు ధరలు పెరిగినప్పుడు రేట్లు పెంచినప్పుడు ధరలు తగ్గినప్పుడు ఫీడ్ రేట్లు ఎందుకు తగ్గించారు అంటూ జగన్ ప్రశ్నించారు.

ఫిషరీస్ యూనివర్సిటీ నిలిపేశారు …

చంద్రబాబు ప్రతీ అడుగు మోసపూరితంగానే కొనసాగుతుందని జగన్ విమర్శించారు. నరసాపురంలో మేం తెచ్చిన ఫిషరీస్ వర్సిటీలో క్లాసులు కూడా ప్రారంభించమన్నారు కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీని నిలిపేశారన్నారు. మెడికల్ కళాశాల కూడా నిలిచిపోయిందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 12 వేల విద్యుత్కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. అక్వా రైతులకు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని, జనరేటర్లు పెట్టుకుని సాగు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కచ్చితంగా ఆక్వా రైతులకు అండగా నిలబడతామని, ప్రభుత్వం దిగి వచ్చేలా ఉద్యమిస్తామని జగన్ ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ఇన్చార్జ్ గుడివాడ అమర్నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు మురళీకృష్ణంరాజు నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి ఉమా బాల, భీమవరం వైసిపి ఇంచార్జ్ వెంకట్ రాయుడు, మాజీ మంత్రులు తానేటి వనిత, ధర్మాన కృష్ణ దాసు, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, కొడాలి నాని, పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తలారి వెంకట్రావు, నాయకులు పివిఎల్ నరసింహారాజు గుడాల గోపి, అబ్బాయి చౌదరి దూలం నాగేశ్వరరావు, మేక శేషుబాబు, కౌరు శ్రీనివాస్, ఏఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.