జనగణమన భావం తెలుసుకోండి!
విద్యార్థులకు జాతీయ గీతం ప్రాముఖ్యతపై అవగాహన
ధర్మాజీగూడెం (లింగపాలెం మండలం), ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలోని అనన్య స్కూల్లో మంగళవారం ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు జాతీయ గీతం “జనగణమన” ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు మాట్లాడుతూ.. జాతీయ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన “జనగణమన” భారతదేశ ఐక్యత, సమగ్రత, దేశభక్తికి ప్రతీకగా నిలిచిందన్నారు. జాతీయ గీతంలోని ప్రతి పదానికి ప్రత్యేకమైన భావం ఉందని, ప్రతి విద్యార్థి దాని అర్థాన్ని తెలుసుకొని గౌరవంతో ఆలపించాలని సూచించారు.
కొంతకాలంగా సోషల్ మీడియాలో యునెస్కో ‘జనగణమన’ను ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా ప్రకటించిందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, దానికి అధికారిక ఆధారాలు లేవని, జాతీయ గీతం గొప్పతనం దాని భావం, చరిత్ర, దేశ ప్రజలను ఏకం చేసే శక్తిలోనే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో అనన్య స్కూల్ ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.
