లక్ష్యసాధనతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి..
ఈఏపీసెట్ ర్యాంకర్లను అభినందించిన ఆర్డీవో దాసి రాజు
కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
శ్రీ సూర్య కళాశాలలో ఘనంగా ర్యాంకర్ల అభినందన సభ
నర్సాపురం, ఆంధ్రప్రభ : కాలాన్ని వృథా చేయకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషి చేస్తే కన్న కలలను సాకారం చేసుకోవచ్చని నర్సాపురం ఆర్డీవో దాసి రాజు అన్నారు. స్థానిక శ్రీ సూర్య కళాశాలలో గురువారం నిర్వహించిన ఈఏపీసెట్–2026 ర్యాంకర్ల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన ఏపీ ఈఏపీసెట్–2026 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు వారికి శిక్షణ అందించిన అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల లక్ష్యసాధన కోసం కళాశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పెద్దల పట్ల ప్రేమ, గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలని, చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. సెల్ఫోన్లను పరిమితికి మించి వినియోగించకుండా విద్యపై పూర్తి దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి శ్రీ సూర్య కళాశాల ఖ్యాతిని రాష్ట్రవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షించారు.
కళాశాల కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని విద్యా సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నత విద్యకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఏపీ ఈఏపీసెట్–2026లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన చినమిల్లి మహాశ్రీ మౌనిక, కోలా యశ్వంత్ బాల మణికంఠ, ముచ్చర్ల ధరణి, వీరవల్లి యామిని శ్రీ విఘ్నేశ్వరి, దొంగ సాయి సాహిల్, పొన్నాడ కీర్తన ప్రమీల, బల్ల మోహనదేవి, సమంతకుర్తి జెస్సిక, కుచ్చెర్లపాటి మౌనిక శ్రీతో పాటు మరో 30 మంది విద్యార్థులను ఆర్డీవో దాసి రాజు పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎ.ఆర్.ఎస్. కుమార్, బి. రామచంద్రరెడ్డి, డాక్టర్ ఫాజిల్, డాక్టర్ కె. జానకిరామ్, ఎస్. వేణుగోపాల్, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ యు. లక్ష్మీకాంత్, డిగ్రీ ప్రిన్సిపల్ పి. పుల్లారావు, అధ్యాపకులు టి. కృష్ణగుప్తా, జె. సుబ్బారావు, పి.ఎల్. వెంకటేష్, పి. సత్యనారాయణ, కె. లక్ష్మీనారాయణ, డి. సురేష్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
