పీసీ-పీఎన్‌డీటీ చట్ట అమలుపై కఠిన చర్యలు..

పీసీ-పీఎన్‌డీటీ చట్ట అమలుపై కఠిన చర్యలు..

స్కాన్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: జిల్లాస్థాయి పీసీ-పీఎన్‌డీటీ యాక్ట్ సలహా సంఘం సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ అధ్యక్షతన మచిలీపట్నంలోని జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో కొత్తగా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న ఆద్య ఫీటల్ కేర్ ఆసుపత్రి (మచిలీపట్నం), ఎం.జే. హాస్పిటల్ (కానూరు), శ్రీ సిద్ధి అడ్వాన్స్డ్ ఫీటల్ కేర్ (గుడివాడ) సంస్థల దరఖాస్తులను పరిశీలించి చర్చించారు.

అలాగే అనుమతుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న కీర్తి హాస్పిటల్ (చల్లపల్లి), ఉత్తమ్ స్కాన్ సెంటర్ (మచిలీపట్నం), సుధాకర్ ఇమేజింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ సెంటర్ (చల్లపల్లి), లతా హాస్పిటల్ అండ్ విజయ ఇమేజింగ్ సెంటర్ (ఉయ్యూరు) దరఖాస్తులను కూడా సమీక్షించారు.

అదేవిధంగా అనుమతుల సవరణ (మోడిఫికేషన్) కోసం దరఖాస్తు చేసుకున్న కామినేని హెల్త్ కేర్ (పోరంకి), లైట్ హోమ్ హాస్పిటల్ (పురుషోత్తపట్నం-గన్నవరం), పిన్నమనేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గన్నవరం) దరఖాస్తులపై చర్చించారు.

పీసీ-పీఎన్‌డీటీ చట్టానికి సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి పంపించిన అవగాహన వీడియోలను సమావేశంలో సభ్యుల సమక్షంలో ప్రదర్శించారు. ఈ వీడియోలను ప్రతి స్కాన్ సెంటర్, ఆసుపత్రి, డయాగ్నస్టిక్ సెంటర్‌లో తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

సోమవారం ఆర్డీవో ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని రెండు స్కాన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే విధంగా జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లు, స్కాన్ సెంటర్లపై ప్రత్యేక బృందాల ద్వారా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కె. ప్రేమ్ చంద్ర్, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్, రేడియాలజిస్ట్ వినీల్, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్. వెంకటేశ్వరరావు, ఎన్జీవో సభ్యులు ధర్మతేజ, సుశీల, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.