మెగా డీఎస్సీపై జగన్ తప్పుడు ఆరోపణలు..

మెగా డీఎస్సీపై జగన్ తప్పుడు ఆరోపణలు..
కూటమి ప్రభుత్వంలో అవినీతికి తావులేదు
శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి అంబులెన్స్ రమేష్.
పుట్టపర్తి – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి అంబులెన్స్ రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఆదివారం పుట్టపర్తిలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయడం చేతకాని జగన్.. ఇతరులు చేస్తుంటే ఓర్చుకోలేక వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జరిగిన నియామకాల్లో ఎక్కడా అవినీతికి తావులేదని స్పష్టం చేశారు.
గతంలో తాను సచివాలయ ఉద్యోగాలను అమ్ముకున్నట్లే ఇప్పుడు కూడా ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని భావించడం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది నిరుద్యోగుల శ్రమను, కష్టాన్ని జగన్ తన ఆరోపణలతో అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన ఐదేళ్ల పాలనలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఒక్కసారి కూడా అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, కొత్త పరిశ్రమలను తీసుకురాకుండా, ఉన్న కంపెనీలను కూడా రాష్ట్రం దాటించి యువత భవిష్యత్తును దెబ్బతీశారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నిర్వహించడం, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.
జగన్ ఎంత విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసి, క్రమబద్ధంగా జాబ్ క్యాలెండర్ అమలు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.
