గ్రామాల్లో అభివృద్ధి, పర్యావరణ హిత కార్యక్రమాలను వేగవంతం చేయాలి

గ్రామాల్లో అభివృద్ధి, పర్యావరణ హిత కార్యక్రమాలను వేగవంతం చేయాలి

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ:
నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, గ్రామ పారిశుధ్య కార్యక్రమాలపై గురువారం ఒక ముఖ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద కూలీల హాజరు శాతం (లేబర్ టర్నౌట్) పెంచడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ స్థితిగతులు, ఐఐహెచ్‌ఎల్‌ఎస్ (IIHLS) డేటా అంచనా, ఫోటో క్యాప్చర్ మరియు వాటి వినియోగంపై విస్తృతంగా చర్చించారు. అలాగే గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్ల పూర్తి వినియోగం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు, ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, స్టీల్ ప్లేట్లు, గ్లాసుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, నర్సరీల నిర్వహణ, రాబోయే సీజన్‌కు మొక్కల నాటకం అంచనాలు , ఘన వ్యర్థాల నిర్వహణ తదితర కీలక అంశాలపై అధికారులు సమీక్షించారు.

ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి , పారిశుధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయి సిబ్బంది సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనుల్లో కార్మికుల హాజరును గణనీయంగా పెంచాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, పర్యావరణ హిత కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్య లోపం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో మండల పరిషత్ అధికారులు (ఎంపీవోలు), స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) కో-ఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ (ఏపీఓ), ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు (ఈసీలు), టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏలు), అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈలు), హౌసింగ్ విభాగం సిబ్బంది రెండు మండలాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.