సుజనా చౌదరి కృషి అభినందనీయం

సుజనా చౌదరి కృషి అభినందనీయం
-సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్
భవానిపురం, ఆంధ్రప్రభ:
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యులు వై. సుజనా చౌదరి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ కొనియాడారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలతో పాటు, వివిధ రైల్వే సమస్యల పరిష్కారం కొరకు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ , విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం. మధు, సుజనా ప్రాజెక్ట్ సెంటర్ ప్రతినిధి ఉదయ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ లతో కలిసి ఆయా ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపినట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో జరుగుతున్న, ప్రతిపాదించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పంజా సెంటర్ నుండి రైల్వే ఇన్స్టిట్యూట్ (తూర్పు రైల్వే బుకింగ్ కార్యాలయం) వరకు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీని పాదచారుల వినియోగం కోసం మరమ్మత్తులు చేయడంతో పాటు, అక్కడ అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకు పోలీసు భద్రతను కల్పించడం కోసం శాసనసభ్యులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మీసాల రాజారావు వంతెన నుండి ప్రధాన రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వరకు బిఆర్టిఎస్ (BRTS) రోడ్డును అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. గతంలో తమిళ పాఠశాల నిర్వహణ కోసం జలవనరుల శాఖ ఇచ్చిన భూమి లీజు కాలపరిమితి ముగిసి ఖాళీగా ఉన్నందున, స్థానిక ప్రజల అవసరాల కోసం ఆ భూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచనల మేరకు రైల్వే అధికారులు ఎర్రకట్ట ఆర్ఓబిల నిర్మాణ నిమిత్తం మూడు కొత్త నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జీల (ఆర్ఓబి) నిర్మాణం కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను తయారు చేసే బాధ్యతను పీఎం గతి శక్తి యూనిట్‌కు అప్పగించారని, దీనివల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. విద్యాధరపురంలో కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా పథకం కింద 28 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ సముదాయంలో బహుళ ప్రయోజన ఇండోర్ స్పోర్ట్స్ హాల్, స్విమ్మింగ్ పూల్, హాకీ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడలు, శిక్షణ కార్యకలాపాలకు సౌకర్యాలను అందించేందుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. సితార జంక్షన్ ఉత్తర వైపున ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రజా సౌకర్యాలు, వినోదం కోసం అభివృద్ధి చేయడంతో పాటు, భవానిపురం లారీ స్టాండ్ ప్రాంతంలో నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపన కోసం ఎమ్మెల్యే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు.
హౌసింగ్ కాలనీలోని జీవో నెం. 76-53-114 గల ఇళ్లు, సమీపంలోని ఇళ్లు నిర్మాణపరంగా ప్రమాదకర స్థితిలో ఉండి నివాసయోగ్యంగా లేనందున వాటిని తొలగించి తిరిగి పునర్ నిర్మాణం చేసేందుకు గల సూచనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దర్గా భూములను ముస్లిం సమాజం ప్రయోజనం, వినియోగం కోసం పాఠశాల, కమిటీ హాల్ లేదా సామూహిక వసతి హోమ్ వంటి కమ్యూనిటీ సౌకర్యాల ఏర్పాటుకు, అలాగే కాపు కళ్యాణ మండపం ప్రతిపాదనను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని చెప్పారు. రానున్న 2028 కృష్ణా పుష్కరాల దృష్ట్యా బెర్మ్ పార్క్ నుండి ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ పాయింట్ వరకు కట్టరోడ్డును ప్రతిపాదిత నదీతీర అభివృద్ధి, విస్తరణ ద్వారా కృష్ణా నదీతీరం వెంబడి ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసి పర్యాటకం, ప్రజా వినోదంతో పాటు స్థిరమైన పట్టణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సుజనా చౌదరి ప్రతిపాదనలు సిద్ధం చేశారని వివరించారు.
దుర్గగుడి అభివృద్ధి దేవాలయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రతిపాదించారని, సైన్స్ సెంటర్ స్థలంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా యువత, విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కుమ్మరిపాలెం సెంటర్ వద్ద విపరీతమైన రద్దీ ఉన్న రోడ్డు ప్రాంతంలోని దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ స్కూల్‌ను ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించి, ఆ ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్ లేదా వృత్తిపరమైన శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్ టౌన్ – టూ టౌన్ ప్రాంతాలను అనుసంధానిస్తూ కాలేశ్వరరావు మార్కెట్ వద్ద రెండు ఖానాలతో కూడిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యుబి) కి అదనంగా మరో ఖానా ఏర్పాటు చేయాలని విజయవాడ రైల్వే డీఆర్ఎమ్‌కు సుజనా చౌదరి లేఖ రాస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. నిజాం గేట్ (వించిపేట) ప్రాంతంలో వర్షపు నీటి కాలువ సమస్యను పరిష్కరించడం కోసం కూడా ఎమ్మెల్యే తగిన కృషి చేస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని ఆకుల శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు.
