రైతు భవిష్యత్తుకు నాణ్యమైన విత్తనాలే పునాది..

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : వ్యవసాయమే దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండటంతో పాటు వ్యవసాయ శాఖ అధికారుల మార్గదర్శకత్వం లభిస్తే వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల పేర్కొన్నారు.

శుక్రవారం నర్సంపేట రైతు వేదికలో వ్యవసాయ సహాయ సంచాలకులు బొమ్మెన శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల మాట్లాడుతూ, డీలర్లు స్టాక్ బోర్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, రైతులకు అవసరమైన వరి ఫైన్ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు బొమ్మెన శ్రీనివాస్ మాట్లాడుతూ, డీలర్లు తమ లైసెన్సులను స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు విత్తనాల విక్రయ సమయంలో తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, బిల్లుపై పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు కోరిన విత్తనాలనే అందించాలని సూచించారు.

నర్సంపేట పట్టణ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులకు చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలు అందించాల్సిన బాధ్యత డీలర్లపై ఉందన్నారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఉత్పత్తుల విక్రయాలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో యువత వ్యవసాయానికి దూరమవుతూ ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా మాత్రమే యువతను తిరిగి వ్యవసాయ రంగం వైపు ఆకర్షించవచ్చు. అందుకోసం రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు, సాంకేతిక పరిజ్ఞానం, సాగుకు అవసరమైన నాణ్యమైన ఇన్‌పుట్లు అందించడమే కాకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం అత్యంత అవసరం.

రైతులు – వ్యవసాయ శాఖ అధికారులు పరస్పర సహకారంతో ముందుకు సాగితే పంటల ఉత్పాదకత పెరగడంతో పాటు వ్యవసాయం పట్ల యువతలో ఆసక్తి పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయి..ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు కృష్ణకుమార్, గోపాల్‌రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, రజిత, శ్యామ్‌తో పాటు డివిజన్ పరిధిలోని ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లు పాల్గొన్నారు.