కర్నూలు రోడ్లపైకి వచ్చిన మెడికల్ దుకాణదారులు…
కర్నూలు రోడ్లపైకి వచ్చిన మెడికల్ దుకాణదారులు…
ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా బంద్.
కర్నూలు నుంచి ఆదోని వరకు మూతపడిన వేలాది మెడికల్ షాపులు.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో బుధవారం మెడికల్ దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరు, వెల్దుర్తి, యమ్మిగనూరు తదితర ప్రధాన పట్టణాల్లో మెడికల్ షాపులు మూతపడడంతో ఔషధ వ్యాపార రంగం పూర్తిగా స్థంభించింది. జిల్లాలో సుమారు 3,500కు పైగా రిటైల్, హోల్‌సేల్ మెడికల్ దుకాణాలు ఉన్నట్లు ఔషధ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కర్నూలు నగరంలోనే సుమారు 850 నుంచి 1,000 వరకు మెడికల్ షాపులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఆదోనిలో 350కు పైగా, ఎమ్మిగనూరులో 250 వరకు, పత్తికొండలో 120, మంత్రాలయంలో 80, కోడుమూరులో 70, ఆలూరులో 60కు పైగా మెడికల్ దుకాణాలు ఉన్నట్లు అంచనా. బంద్ పిలుపు నేపథ్యంలో వీటిలో అత్యధిక దుకాణాలు మూతపడినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలు నగరంలోని మెడికల్ షాప్ యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో స్టేడియం నుంచి ఎస్బీఐ సర్కిల్ మీదుగా ఆర్ఎస్ రోడ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు యాడికి పుల్లయ్య మాట్లాడుతూ… ఆన్‌లైన్ విధానంలో మందుల సరఫరా పెరిగితే చిన్న, మధ్య తరహా మెడికల్ దుకాణాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబాలు మెడికల్ షాపులపై ఆధారపడి జీవిస్తున్నాయని, ఆన్‌లైన్ విక్రయాల వల్ల వారి ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఆన్‌లైన్ ఫార్మసీల ద్వారా నకిలీ మందులు విక్రయించే ప్రమాదం ఉందని, నియంత్రణ లేకుండా మందులు అందుబాటులోకి రావడం వల్ల యువత మాదకద్రవ్యాల బారిన పడే అవకాశం పెరుగుతోందని పేర్కొన్నారు.
డోర్ డెలివరీ విధానం, భారీ డిస్కౌంట్ల పేరుతో కార్పొరేట్ సంస్థలు చిన్న వ్యాపారులను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. కర్నూలు నగరంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రధాన ఔషధ మార్కెట్ ప్రాంతాలైన ఓల్డ్ టౌన్, బుధవారపేట, గాయత్రి ఎస్టేట్, నంద్యాల చెక్‌పోస్ట్, ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో మెడికల్ షాపులు మూతపడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అత్యవసర సేవల దృష్ట్యా కొద్ది అపోలో, మెడ్‌ప్లస్ ఫార్మసీలు, ప్రభుత్వ ఆసుపత్రుల ఔషధ కేంద్రాలు, నర్సింగ్ హోమ్ ఫార్మసీలు పనిచేశాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించింది.
మంత్రాలయం, ఆలూరు, కోడుమూరు, పత్తికొండ వంటి పట్టణాల్లో ఉదయం నుంచే మెడికల్ షాపులు మూసివేయడంతో ప్రజలు ముందస్తుగానే మందులు కొనుగోలు చేసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఆన్‌లైన్ మందుల విక్రయాలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శ్రీధర్, విజయభాస్కర్ సహా అఖిల భారత కెమిస్టుల సమాఖ్య నాయకులు, మెడికల్ షాప్ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
