నల్లమల నుంచే రేవంత్ రాజకీయ పతనం..

నల్లమల నుంచే రేవంత్ రాజకీయ పతనం..
పాలమూరు బిడ్డనంటూ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి
ప్రాజెక్టులు పక్కన పెట్టి భూదందాలే లక్ష్యం
మైనింగ్ మాఫియా కు వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మాజీ శాసనసభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “పాలమూరు బిడ్డ” అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తయిందని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం భూసేకరణ గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని ఆయన ఆరోపించారు.
రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు హడావుడి చేయడం రాజకీయ డ్రామా మాత్రమేనన్నారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఉమామహేశ్వర ప్రాజెక్ట్ వంటి కీలక ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని గువ్వల బాలరాజు ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఉమామహేశ్వర ప్రాజెక్ట్ భూసేకరణ పనులను స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అడ్డుకుంటున్నారని విమర్శించారు. “ఒక ఎకరం భూమి పోకుండా అచ్చంపేటకు నీళ్లు తెస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు రిజర్వాయర్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు?” అని ప్రశ్నించారు.
బల్మూరు మండలం, మైలారం గ్రామంలో మైలారం మైనింగ్ మాఫియాకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వత్తాసు పలికారని అన్నారు. ముఖ్యమంత్రికి ప్రాజెక్టులపై కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారాలపైనే ఎక్కువ ఆసక్తి ఉందని, వేల కోట్ల ఆస్తులు కూడబెట్టడమే లక్ష్యంగా పాలన సాగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. “మద్దిమడుగు అంజన్న పాదాల సాక్షిగా నల్లమల నుంచే రేవంత్ రెడ్డి రాజకీయ పతనం ప్రారంభమవుతుందని, పాలమూరు రైతులను, గిరిజనులను, నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ముఖాన్ని గ్రామ గ్రామాన బట్టబయలు చేస్తాం” అని హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ నైజమైందని, రైతుల కోసం పోరాడే నాయకులను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. “పాలమూరు వలస కూలీ బిడ్డను… పేదరికం, ఆకలి, కష్టాలు ఏమిటో నాకు తెలుసు. అందుకే రైతుల బాధ నాకు అర్థమవుతుంది” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. త్వరలో అచ్చంపేట, మద్దిమడుగు కేంద్రంగా భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు రైతుల పక్షాన ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మంగ్యానాయక్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జానకీ, పట్టణ అధ్యక్షుడు గండు శ్రీనివాసులు, నాయకులు శంకర్ మాదిగ, శంకర్ నాయక్, శ్రీను, శివచంద్ర, చందులాల్ తదితరులు పాల్గొన్నారు.
